Skip to main content

Confidence

లోకమంతా సజావుగా నడవడానికి నమ్మకం కీలకం. అది ఉంటే దేన్నయినా సాధించవచ్చు. ద్వైదీభావం, అనుమానం, అపనమ్మకం లాంటివి ఏ కోశానా లేకుండా పూర్తి విశ్వాసంతో తన ప్రయత్నం చేసిననాడు- ఆ పని కచ్చితంగా నెరవేరి తీరుతుంది.

ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః
దైవేన దేయమితి కా పురుషావదంతి
దైవం నిహత్యకురుపౌరుష మాత్మశక్త్యా
యత్నేకృతేయదినసిధ్యతి కోత్రదోషః
(ప్రయత్నశీలుని విజయలక్ష్మి వరిస్తుంది. భగవంతుడే అన్నీ చేస్తాడని చూడకుండా తనమీద తనకు నమ్మకంతో మానవ ప్రయత్నం చేయడం నీ కర్తవ్యం. అలా చేసిన ప్రయత్నం ఫలించకపోయినా అందులో నీ దోషం లేదు)

తన మీద తనకు నమ్మకం కలిగినవారికి దేవుడు కూడా సాయపడతాడు. ఒక యువకుడు ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి ఫలించటంలేదు. తనమీద దేవుడికి దయలేదని ఒకసారి, తన ఖర్మ ఇంతేనని ఒకసారి, తనకిక ఉద్యోగం రాదని తాను తెలివితేటలు లేనివాడనని మరొకసారి... ఇలా అనుకుంటూ నిరాశనిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు పుస్తకాల సంచితో పాటు గొడుగునూ వెంటపట్టుకుని బడికి వెళుతున్నాడు. ఆ సమయంలో వాతావరణం పొడిగా ఉంది. గొడుగు అవసరమేమిటనిపించి ఆ పిల్లవాడినే అడిగాడు. దానికా కుర్రవాడు 'సాయంత్రం వర్షం వస్తుంది. అప్పుడు గొడుగు అవసరముంటుంది. అందుకని...' అన్నాడు.

ఆ మాటకు ఆశ్చర్యపోయిన ఆ యువకుడు 'వర్షం వస్తుందని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?' అనడిగాడు.
'ఈరోజునుంచి వర్షకాలం మొదలవుతుందని, మొదటిరోజు తప్పక వాన కురుస్తుందని అమ్మ చెప్పింది. మా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు' అన్నాడు. ఆ మాటల్ని బాల్యచేష్టలుగా తలచి పట్టించుకోలేదా యువకుడు. ఆ సాయంత్రం నిజంగానే వర్షం కురిసింది. అప్పుడనుకున్నాడు- 'ఆ బాలుడికి తన తల్లి మాటలమీద నమ్మకం ఉండబట్టే కదా ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరాడని.

ఆ సంఘటనతో- ఏ ప్రయత్నం చేసినా తనమీద తనకు నమ్మకం ఉంటేనే విజయం సిద్ధిస్తుందనిపించింది. కొన్నాళ్ళ తరవాత ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యాడా యువకుడు. ఉన్నది ఒకటే ఉద్యోగం. దానికి తనలాగే అనేకమంది వచ్చారు. వారందర్నీ చూసి అధైర్యం కలిగింది మొదట. వెంటనే ఆ బాలుడు మదిలో మెదిలాడు. అతడి స్థిరనమ్మకం గుర్తొచ్చింది. ఆపై తాను ఈ ఇంటర్వ్యూ కోసం చేసిన సాధన గుర్తొచ్చింది. స్థిమితపడ్డాడు.

అందరినీ పరీక్షించడం పూర్తయ్యాక యజమాని అభ్యర్థులందరినీ ఒకచోట సమావేశపరచి 'ఈ ఉద్యోగం మీలో ఎవరికొస్తుందనుకుంటున్నారు?' అనడిగాడు.

రకరకాల అనుమానాలు, భయాలతో ఎవరూ జవాబు చెప్పడానికి సాహసించలేదు. అలాంటి సమయంలో ఆ యువకుడు నిలబడి 'ఈ ఉద్యోగం తప్పక నాకే వస్తుంది' అన్నాడు తడుముకోకుండా.

అతడలా అనగానే 'అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు?' అని ప్రశ్నించాడా యజమాని.

జవాబుగా 'ఈ పరీక్షలో నెగ్గాలని నాలుగు రోజులుగా కష్టపడుతున్నాను. ఇందాక మీరు చేసిన ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెప్పగలిగానని నమ్మకం ఉంది కాబట్టి' అన్నాడు.

ఆ మాటల్లోని ఆత్మస్త్థెర్యం కనిపెట్టిన యజమాని 'నీకీ ఉద్యోగం వస్తే ఎలా భావిస్తావు?' అనడిగాడు మళ్ళీ.

దానికా యువకుడు 'ప్రయత్నానికి తగిన ప్రతిఫలమని' అన్నాడు. ఆ మాటతో ఆ ఉద్యోగం అతడినే వరించింది.

కాబట్టి-
కో అతిభారః సమర్థానాం కిందూరం వ్యవసాయినామ్‌.
కోవిదేశః సవిద్యానాం కఃపరః ప్రియవాదినమ్‌!
సమర్థులకు మోయరానిది ఉండదు. ప్రయత్నశీలురకు పట్టుబడనిదంటూ ఉండదు. విద్యావంతులకు పరదేశమనే బాధ ఉండదు. మంచిగా మాట్లాడేవారికి శత్రువులుండరు.(ఈనాడు, అంతర్యామి,20:06:2008)

- అయ్యగారి శ్రీనివాసరావు

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

వేమన పద్యాలు

అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అధికుడైన రా జొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు. అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది *********************************************** నిండునదులు పారు నిలచిగంభీరమై వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధిక...

10,000hours

గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు?   ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్‌ పరిశోధకులు.  ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం.  దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్‌ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్‌ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి,...