Skip to main content

వేమన పద్యాలు


అంతరంగమందు నపరాధములు చేసి

మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.

***********************************************
అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ.
***********************************************
అధికుడైన రా జొకల్పుని జేపట్ట
వానిమాట చెల్లు వసుధలోన
గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ.
***********************************************
తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు.
అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది.
సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు.
అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది
***********************************************
నిండునదులు పారు నిలచిగంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము:

అల్పఙ్ఞుడు ఆవేశముతో అన్ని పనులను చెడగొట్టునటుల,
సెలయేరు ఒడిదుడుకులతో ప్రవహించి అన్నింటిని ధ్వంస మొనర్చినట్లే,
వివేకవంతులు నిండునదులవలె నీతి బోధలొనర్చి, పనులు సఫలము చేయుదురు.
***********************************************
ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
బరగ మూలికలకు బనికివచ్చు
నిర్ణయాత్మకుండు నీచుడెందులకౌను
విశ్వధాభిరామ వినురవేమ

 తాత్పర్యము:ఎంతో చేదు వృక్షములైన వేప, ముషిణి(ముష్టి) చెట్లు సైతము మందుల తయారీలో ఉపయోగపడును. క్రూరాత్ముడైన మానవుడు ఎవరికి ఉపయోగపడగలడు?
***********************************************
నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బయట కుక్కచేత భంగ పడును
స్థాన బలిమి కాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ

 తాత్పర్యము:నీళ్ళ లోని మొసలి స్థాన బలం వల్ల తప్పితే తన బలము తొ ఏనుగు ని ఓడించలేదు.
అందుకె మన స్థానం లో మనం ఉండవలెను.
కాని ఎక్కడికి వెళ్ళినా, మన భాషను మరిచిపొకూడదు.
ఏ దేశమేగినా ఎందు కాలిడిన మన భాషను మరిచిపొకూడదు.
***********************************************
ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన
బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి
తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా!
విశ్వదాభిరామ వినురవేమ

ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం. వారు తపః సంపన్నులు కాబట్టి సృష్టికర్త మెప్పును పొందారు. ఉత్తమ స్థాయిని పొందిన వారి గురించి కులం గిలం అనే మీమాంస ఎందుకు? ఏ కులం వారైనా చివరకు చితిని చేరుకోవడమే కదా! గ్రహించమంటున్నాడు వేమన.
***********************************************
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
***********************************************
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.
***********************************************
నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.
***********************************************
ఊరి వారు బావి యుదకము నిందించి
పాదతీర్థమునకు భ్రమసినారు
పాద తీర్థమునకు ఫలమేమి కద్దురా
విశ్వదాభిరామ వినురవేమ

లోకులు ఊరిలోని బావి నీటిని తక్కువగా భావిస్తూ గురువుల కాళ్లు కడిగిన నీటిని పవిత్రంగా భ్రమపడుతున్నారేమిటి? అట్లాంటి నీటివల్ల వొరిగేదేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు వేమన.
***********************************************
తనువునందు అగ్ని దరికొని కాల్వంగ
కాల్చుకొనుటయేమి కర్మమునకు
కాల్చుకొన్నయంత ఘనుడాతడాయెనా?
విశ్వదాభిరామ వినురవేమ

మానవ శరీరంలోనే జ్ఞానాగ్ని మండుతూ ఉంటే మళ్లీ దానిని చక్రాంకితాలతో కాల్చుకోవడం వల్ల ప్రయోజనమేముంటుంది? అలా తప్తముద్రలు వేసుకున్నంత మాత్రాన అతడు యోగ్యుడవుతాడా? అని సరదాగా ప్రశ్నిస్తున్నాడు వేమన.
***********************************************
కల్మషంబు పోక కనుపించదెందును
రూపమెవ్వరికిని రూఢి తోడ
తామసంబుడిగిన తగగల్గు జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ

చేసిన పాపం పోకుండా ఎవరికైనా దేవుని దివ్యరూపం స్పష్టంగా కనిపించదు. అట్లాగే అజ్ఞాన జనితమైన తామస గుణాలు నశిస్తే తప్ప, నిజమైన జ్ఞానం నీ సొత్తు కాదు అంటున్నాడు వేమన.
కల్మషం అంటే పాపం. క్రౌర్యం, కోపం, మూర్ఖత్వం వంటి వాటి వలన పాపాలు జరుగుతాయి. పాపంతో కలుషితమైన మనస్సుకు నిర్మలమైన దైవ స్ఫురణ కలగదు. రూపం అంటే ఆకారం.

ఇది కంటికి కనిపించే స్థూల రూపం కాదు. ఆత్మ స్వరూపం. రూఢి అంటే నిశ్చయంగా అని అర్థం. వ్యుత్పత్తి అర్థంలో కాక, వేరే అర్థంలో ఉన్న దాన్ని రూఢి అంటారు. ఉదాహరణకు పంకజం ఉందనుకోండి. ఇది పద్మంగా లోక రూఢికెక్కింది. కాని అసలర్థం బురదలో పుట్టిందని. నిశ్చయంగా తెలియటమంటే ఇదే. అట్లాగే తామస గుణమంటే తమోగుణం. క్రియాహీనం, ఎరుకలేమి, నిద్ర, మాంద్యం లాంటివి తామస గుణాలు.

‘కల్మషంబు పోక’ అంటున్నాడు వేమన. పోక అంటే పోకుండా అని అర్థం. పోవడానికి వ్యతిరేకార్థకమిది. రాక, రాకుండా లాగ. పాపం జరగడానికి కోరికలు, అహంకారం, కామక్రోధాలు, భ్రాంతులు, మమతల లాంటివి కారణమౌతాయి. వాటిని తొలగించుకోవడం అంత సులభం కాదు. ధ్యానంతో, యోగాచరణంతో వీటిని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడే శుద్ధమైన జ్ఞానం అనుభవంలోకొస్తుందని వేమన్న ఉవాచ.
***********************************************
కప్పురంపు మనసు కాంక్షించు యోగికి
జ్ఞానదీప శిఖయు తానటించు
కానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్ఛ
విశ్వదాభిరామ వినురవేమ

కర్పూరం లాంటి స్వచ్ఛమైన మనసును అలవరచుకునే పవిత్రుడిలో జ్ఞానజ్యోతి వెలిగి, ఒకానొక ఆత్మస్ఫురణ కలుగుతుంది. ఆ ఆత్మ క్రమంగా అతని అనుభవంలోకి వస్తుంది. అతడు కోరుకున్నదదే అంటున్నాడు వేమన.

కప్పురము అంటే కర్పూరమే. ఘనసారం అని కూడా అంటారు. ‘కప్పుర విడెము’ అని అల్లసాని వారన్నారు. కప్పురము అనే రూపానికి ‘వృత్తియందు హల్లు పరమగుచో ‘ము’ వర్ణలోపము వికల్పము’ అనేది వ్యాకరణ సూత్రం. కర్పూరమంటే ఇక్కడ కర్పూర తైలం. ఇది సువాసనా భరితం.

ఇక జ్ఞానదీపం. జ్ఞానమంటే ఎరుకే. తత్వజ్ఞానమన్నమాట. యదార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమయ్యే చైతన్యాన్ని జ్ఞానమంటారు. ఇది స్వయంగా ప్రకాశించటమే కాకుండా ఇతరాలను కూడా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి కర్పూరం లాంటి శుభ్రమైన మనస్సును అది వెలిగించటం సహజం. ఆ వెలుగులో ఆత్మానుభూతికి దారి ఏర్పడుతుందనేది సారాంశం. అయితే ఆత్మజ్ఞానం ఒక్కసారిగా కలిగేది కాదు. క్రమంగా కలుగుతుంది. అంటే ఒక దాని వెంట మరొక స్థితిని అందుకుంటూ ముక్తిని పొందటమన్నమాట.

దీప శిఖ అంటే దీపం యొక్క కొన, అగ్ని జ్వాల. నటించు అంటే ప్రవర్తించడం. ఇచ్ఛ అంటే కోరిక. అలభ్య వస్తువును సంపాదించడం కోసం కలిగే సంకల్పాన్ని ఇచ్ఛ అంటారు. ఇక్కడ ఇచ్ఛకు పర్యవసానం ముక్తి అని అంతరార్థం.
***********************************************
కాలవశము బట్టి కర్మజీవుల పిండు
మత్తులగుచును మదమత్తులైరి
మత్తులైన జనుల మనసేటి మనసయా
విశ్వదాభిరామ వినురవేమ
జీవులు కాలానికి వశులై, చచ్చిపోతూ పుడుతూ ఉంటారు. వారు ఆయా జన్మల్లో చేసిన మంచి, చెడు పనులను బట్టి ఆయా ఫలితాలను అనుభవిస్తారు. చెడ్డ పనులు రజో, తమో గుణాల వల్ల జరుగుతాయి. ఈ గుణాలకు మూలమైన మనసూ ఒక మనసేనా? దానివల్ల ఉపయోగమేమీ లేదు అని చిరాకుపడుతున్నాడు వేమన.

జీవులందరూ కాలప్రవాహంలో కొట్టుకుపోతుంటారు. నిత్యకర్మల పాలౌతుంటారు. ఈ ప్రక్రియలో ఆశాభ్రాంతులకు లోనయ్యే మనస్సు అనర్థదాయకంగా మారుతుందనేది సారాంశం. అట్లా కాకుండా మనస్సును అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం అని వేమన్న సందేశం.

కాలం అంటే సమయం. దీనిని నిర్ణయించేవాడు సూర్యుడు. కర్మ అంటే పని. నిరంతరం పనిచేసుకుంటూ పోయే వ్యక్తి కర్మజీవి. కాని ఇక్కడ కర్మఫలాలు అనుభవించేవాడని. మత్తు అంటే వాస్తవ స్పృహ లేకుండా చేసే మాదక గుణం. మదం అరిషడ్వర్గాల్లో ఒకటి. మద్యపానం వల్ల కలిగే మత్తు కూడా అంతే. విచక్షణా జ్ఞానాన్ని హరిస్తుంది. కాబట్టి మనసును దుర్గుణ దూషితం కాకుండా కాపాడుకుంటే మంచిది అంటున్నాడు వేమన.
***********************************************
పట్టుగొమ్మ లేక పలు పాటుపడువారు
పెట్టి పొయ్య లేక తిట్టువారు
ముట్టి శివుని పూజ మొదలె సేయరు వారు
విశ్వదాభిరామ వినురవేమ

తమకెవరూ అండలేక అనేక బాధలు పడుతుంటారు కొందరు. అలాగే కోరి చేరిన వారికి తిండిపెట్టే శక్తి లేక విదిలించి కొట్టేవారు మరికొందరు. అటు పైనున్న వారి ఆధారం లేక ఇటు కింది వారికి ఆధారం కాలేక అంగలార్చడం కంటే అందరి కన్న పైవాడు శివుడు, అతన్ని ముందే నమ్ముకోవచ్చు గదా! లింగాన్ని తాకి పూజ చెయ్యొచ్చు కదా అని సూచన చేస్తున్నాడు వేమన.

పట్టుగొమ్మ, పెట్టి పొయ్యడం అనేవి జాతీయాలు. నుడికారాలు, పలుకుబళ్లు అని కూడా అంటారు. ఇంగ్లిషులో జీఛీజీౌఝ. ఒక జాతికే ప్రత్యేకమైన వ్యక్తీకరణలన్నమాట. పట్టుగొమ్మ అంటే ఆశ్రయం. చెట్టు పెకైక్కినవాడు పడకుండా పట్టుకునే కొమ్మను పట్టుగొమ్మ అంటారు. పెట్టి పొయ్యడం అంటే పోషించడం. ఇక్కడ శివుణ్ని నమ్ముకోవడమంటే ఆయన అనుగ్రహంతో తనని తాను నమ్ముకోవడం అని సారాంశం.

అంత కొరత దీరి అతిశయ కాముడై
నిన్ను నమ్మి చాల నిష్ఠ తోడ
నిన్ను గొల్వ ముక్తి నిశ్చయముగ కల్దు
విశ్వదాభిరామ వినురవేమ

అతడు అప్పటివరకూ గల తప్పులన్నీ తెలుసుకున్నాడు. నీపట్ల నిండైన కోరికతో ఉన్నాడు. సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడు. అంకితభావంతో నిన్ను కొలుస్తున్నాడు. అటువంటప్పుడు అతనికి ముక్తి లభించకుండా ఎట్లా ఉంటుంది? తప్పకుండా లభిస్తుంది అంటూ ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన గుణాల గురించి చెప్తున్నాడు వేమన.

కొరత అంటే వెలితి, లోటుపాట్లు. ఎటువంటి లోపాలూ పాపాలూ లేకుండా, ఉన్నా తొలగించుకొని అని అర్థం. ‘అతిశయ కాముడై’ అంటే అతిశయించిన, అంటే ఎక్కువైన కోరికతో అని. నిష్ఠ అంటే నియమ పాలన. నిష్ఠ అంటే యోగ నిష్ఠ కావొచ్చు లేదా బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించగూడదనే నిబద్ధతా కావొచ్చు. ముక్తి అంటే ఇంద్రియాల నుండి ఆత్మ విడిపడి పోవటం, భయము లేని స్థితి. ఇంత సాధనాసంపత్తి ఉన్నప్పుడు అతనికి ముక్తి తథ్యం అంటున్నాడు వేమన
***********************************************
(Some of the explanations for the above poems taken from SAAKSHI )

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

Try these

WORK as if you have no need of the money. LOVE as if nobody ever made you suffer. DANCE as if nobody is watching you. SING as if nobody is hearing you. LIVE as if the paradise were on this Earth.

For TV and Computer users(how to avoid eye problems)

The eye was not made to be constantly focused on close objects.If your work requires that you stare at a computer screen all day long or if you watch a lot of television, stop from time to time to do a few eye exercises.For example, roll your eyes in large circles in both directions; look over to each side as far as possible and then go from up to down; or scan an imaginary text on the wall from left to right; or look out the window as far as you can following the horizon then return to a point right in front of you and begin again.In this way, you will avoid long term eye problems, you will enlarge your inner space, and relax both your eyes and your mind.