Skip to main content

జీవన మకరందం

కొందరిని చూస్తుంటే- ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆనందంగా కనిపిస్తారు. మరికొందరిని చూస్తే నిత్యం దుఃఖం ఓడుతూ ఉంటారు. 'నువ్వు ఆనందస్వరూపుడివి...' అంటుంది వేదాంతం. కాదు పొమ్మంటుంది- వాస్తవ జీవితం! ఈ వ్యత్యాసానికి మూలాలు కనుగొనాలని మనిషి ఎంతోకాలంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆనందంకోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. దాని నిజస్వరూపం బోధపడక, స్వేచ్ఛగా విలాసంగా గడపడమే- ఆనందం అని మనిషి పొరపడటం మనం ఈనాడు చూస్తున్నాం. సుఖమూ, సంతోషమూ, ఆనందమూ అనేవి నిజానికి వేరువేరు. ఈ మూడూ ఒకటేనని మనిషి పొరపడుతుంటాడు. సుఖం అనేది ఇంద్రియ, లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసే పదం. ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. సంతోషమనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలిసొచ్చినప్పుడో మనసు ఉత్తేజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరం కూడా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ రెండింటికన్నా ఉన్నతమైనది, ఉదాత్తమైనది- ఆనందం. శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటికీ సంతృప్తిని కూర్చే ఒకానొక గొప్ప స్థితిపేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కబెట్టినవారికి- ఆనందమయ స్థితి వరంగా లభిస్తుంది. 'ఆత్మలోని అంతర్గత శక్తిమూలంగా ఆనందం ప్రభవిస్తుంది'- అన్నాడు మార్కస్‌ అరిలియస్‌. 'ఆనందం తన సహజసిద్ధమైన స్వభావమని మనిషి మరిచిపోవడమే జీవితంలో విషాదానికి కారణం' అన్నాడాయన. ఆనందాన్ని మనిషి స్వయంగా అనుభవించవలసి ఉండగా- 'దాన్ని ఇతరుల కళ్ళ ద్వారా చూడాలనుకోవడం అవివేకం' అన్నాడు షేక్‌స్పియర్‌. లోకంలో ఎక్కడ చూసినా ఈ రకమైన వివేక రాహిత్యమే ప్రస్తుతం రాజ్యమేలుతోంది.
ఇంద్రియ సుఖాలనే- ఆనందానుభూతులుగా మభ్యపెట్టాలని అల్లసాని 


పెద్దన్నగారి వరూధిని తీవ్రయత్నం చేసింది. శారీరకమైన సౌఖ్యాలకీ, 


ఆత్మగతమైన ఆనందానికీ వ్యత్యాసం బాగా తెలిసినవాడు కనుక ప్రవరుడు 


ఆమె కోరికను నిస్సంకోచంగా తిరస్కరించాడు. ఆత్మ సాంగత్యంతో 


ప్రమేయంలేని ఇంద్రియాలది ఆనందంకాదు- అర్థంలేని సుఖం! పట్టుతేనె 


రుచి తెలిసినవాడు శాక్రిన్‌ తీపికి మోజుపడడు. ఆనందం విలువ తెలిసినవాడు 


కేవల ఇంద్రియ సుఖాలకు వెంపర్లాడడు. ప్రవరుడి వైఖరిలోని ఈ కాఠిన్యాన్ని 


అర్థం చేసుకోవాలంటే- మహాత్మాగాంధీ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. 


'ఆనందమనేది ఏమేమి పొందామన్నదానికన్నా- ఏమేమి 


వదులుకోగలిగామన్నదానిపై ఎక్కువగా ఆధారపడుతుంది' అన్నారాయన. 


ప్రవరుడు వదులుకున్నది సుఖం, పొందింది ఆనందం! మనం ఏవేవో ఖరీదైన 


వస్తువులు కొని తెచ్చి, ఇంటినిండా పేర్చి, వాటికి యజమానులం 


అయ్యామని సంతోషిస్తాంగాని, వాటికి బానిసలం అవుతున్నాం అనేదే- 


చేదునిజం. ఈ సత్యం బోధపడితే మనిషికి దుఃఖంనుంచి సంతోషం మీదుగా 


ఆనందంవైపు ప్రయాణం చెయ్యడం సులభమవుతుంది. జీవితం అనేది 


మనిషికి లభించిన బహుమతి, ఆనందమనేది సాధించవలసిన బహుమతి. 


ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు, హాస్యసన్నివేశాలు చూసి ఆనందంతో 


హాయిగా నవ్వుకునేవారి శరీరాల్లో 'ఇంటర్‌ ఫెరాన్‌గామా' అనే రసాయనం 


ఉత్పత్తి అవుతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మనిషి అనారోగ్య లక్షణాలను 


దూరంచేసే రసాయనమది. మనిషి ఆనందమయస్థితిలో ఉన్నప్పుడు 


మానసిక, శారీరక సమతౌల్యం ఏర్పడుతున్న విషయమూ రుజువైంది.


మానవ జన్యువులపై పరిశోధన చేసినవారు- జన్యుపరంగా చూస్తే మానవుడి ఏకైక విధి సంతానోత్పత్తిగా తేల్చిచెప్పారు. సంతానోత్పత్తి వయసు దాటిపోగానే జన్యువులు బలహీనపడటం మొదలవుతుంది. క్రమంగా శరీరనిర్వహణ విధులు నిర్వహించే జన్యువులు నీరసపడతాయి. వ్యాధులు దేహాన్ని చుట్టుముడతాయి. ఒకరకంగా మనం చనిపోవడం లేదు- జన్యువుల చేతిలో హత్యకు గురవుతున్నాం.. అని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్‌ ప్రొఫెసర్‌ టామ్‌కిర్క్‌వుడ్‌ మూడేళ్ళక్రితమే ప్రకటించారు. అదే జన్యువుల పాత్రను మరో కొత్తకోణంలోంచి విశ్లేషిస్తూ- మనిషిలో ఆనందానికి కారణం జన్యువులేనని ఎడింబరో విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు కొత్తగా ప్రకటించారు. 'బాహ్యప్రపంచంలోని పరిస్థితుల కారణంగా మనిషి ఆనందంగా ఉంటాడని అందరం అనుకుంటాం. నిరంతరం ఆనందంగా ఉండటంలో జన్యువుల పాత్ర ఎంతో అధిక'మని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ విస్‌ అంటున్నారు. వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేవనుకుంటే పొరపాటు అంటున్నారాయన. ఆనందమయ స్థితిని అందుకొన్న అదృష్టవంతుల జీవితాల్లోనూ కష్టాలుంటాయి, వేదన ఉండదు. వారి జీవితాల్లోనూ శ్రమ ఉంటుంది, అలసట ఉండదు. ఆటుపోట్లు ఉంటాయి, కుంగిపోవడం ఉండదు. చైతన్యగతమైన ఆనందం- మానవ శరీరానికి ఇచ్చే గొప్ప కానుక ఇది. మొత్తం 900 మందిని పరిశీలించగా ఈ తరహా వ్యక్తిత్వం కలిగిన అందరి శరీరాల్లోనూ ఒకే రకమైన జన్యునిర్మాణం ఉన్నట్లు డాక్టర్‌ అలెగ్జాండర్‌ గుర్తించారు. జన్యువుల ఏకైక విధి సంతానోత్పత్తి అయినప్పుడు- ఆనందన్నిచ్చే జన్యువులకు ఆ లక్షణం ఎక్కడినుంచి వచ్చింది? ఆ జన్యువుల పుట్టుకకు కారణమైన ఆనందమయస్థితిలోని మనిషినుంచి! ఆ మనిషి జీవలక్షణాలు జన్యువుల్లో నిక్షిప్తమైందన్న మాట. తియ్య మామిడి కావాలనుకుంటే- బంగినపల్లి టెంకలను నాటుకుంటేనే కదా సాధ్యమయ్యేది. వేపవిత్తులు నాటితే చెరకుగడలు మొలవవు. నిత్యం దుఃఖంలో నానుతూ ఉండే మనిషి ఆనందాన్ని పంచలేడు. నిరంతరం ఆనందంగా ఉన్నవాడు మాత్రమే చుట్టూ ఉండేవారికి, తరవాతి తరానికి సైతం తన జీవలక్షణమైన ఆనందాన్ని అందించగలడు. ఎవరైనా తమ దగ్గర ఉన్నదే ఇవ్వగలరు!
(ఈనాడు, సంపాదకీయం, 16:03:2008)

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

Try these

WORK as if you have no need of the money. LOVE as if nobody ever made you suffer. DANCE as if nobody is watching you. SING as if nobody is hearing you. LIVE as if the paradise were on this Earth.

For TV and Computer users(how to avoid eye problems)

The eye was not made to be constantly focused on close objects.If your work requires that you stare at a computer screen all day long or if you watch a lot of television, stop from time to time to do a few eye exercises.For example, roll your eyes in large circles in both directions; look over to each side as far as possible and then go from up to down; or scan an imaginary text on the wall from left to right; or look out the window as far as you can following the horizon then return to a point right in front of you and begin again.In this way, you will avoid long term eye problems, you will enlarge your inner space, and relax both your eyes and your mind.